భువనగిరి మార్కెట్ కమిటీ పీఠంపై రాజకీయ రగడ!

16-11-2026 | 11:49pm
  1. చైర్మన్ కుర్చీ కోసం ఆశావహుల మధ్య పోటాపోటీ.. తెరపైకి కీలక నేతల పేర్లు!
  2. విధేయులకా..? సీనియర్లకా..? కొత్తగా చేరిన వారికా..?
  3. చైర్మన్ రేసులో గడ్డం బాల్‌రెడ్డి, గోలి నరేందర్‌రెడ్డి పేర్లు!**
  4. పట్టణ నేతలు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కూర వెంకటేష్‌ల ఆశలు!
  5. వైస్ చైర్మన్‌గా చిక్కుల వెంకటేశంకు అవకాశం?
  6. మంత్రి కోమటిరెడ్డి నిర్ణయం కోసం కాంగ్రెస్ శ్రేణుల ఎదురుచూపులు!

ఆలేరు, నవంబర్ 16 (విజయక్రాంతి): భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ(Bhuvanagiri Agricultural Market Committee) చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుంది..? అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడిని అదృష్టం వరించనుంది..? పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన సీనియర్లకు గుర్తింపు లభిస్తుందా..? లేక కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశం కల్పిస్తారా..? ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది.

మార్కెట్ కమిటీ గత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కొత్త చైర్మన్ ఎంపికపై ఆశావహుల్లో హడావుడి మొదలైంది. కీలకమైన ఈ నామినేటెడ్ పదవి కోసం తెరవెనుక ప్రయత్నాలు ఊపందుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

విధేయతకు పట్టం.. సీనియారిటీకి గుర్తింపు దక్కేనా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలోనూ పార్టీని నమ్ముకుని, కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచి, పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ సీనియర్ నాయకుల నుంచి వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడితే అసంతృప్తి పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈసారి ఎంపికలో పార్టీ విధేయత, సీనియారిటీ, సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

చైర్మన్ రేసులో ఎవరెవరు..? బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించిన భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, మరో నాయకుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు పేర్లు ఆశావహుల జాబితాలో వినిపిస్తున్నాయి.

మరోవైపు బీబీనగర్ మండలం గూడూరు గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం బాల్‌రెడ్డి, బీబీనగర్ మండల మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్‌రెడ్డి పేర్లు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే స్థాయిలో ఈ పేర్ల ప్రస్తావన జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ మరింత పెరిగింది.

 వైస్ చైర్మన్ పదవిపై కూడా ఆసక్తి! చైర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ ఎంపికపైనా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు చిక్కుల వెంకటేశంకు వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ప్రాంతీయ సమతుల్యతతో పాటు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

కోమటిరెడ్డి నిర్ణయమే కీలకం.. ఆశావహుల్లో టెన్షన్ భువనగిరి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని పార్టీ ముఖ్య నాయకుల చుట్టూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు పట్టణ నాయకులు తమకు అవకాశం రావాలని కోరుకుంటుండగా, మరోవైపు మండల స్థాయి సీనియర్ నాయకులు తమ సేవలను గుర్తించాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

చివరకు చైర్మన్ పీఠం పట్టణ నాయకుడిని వరిస్తుందా..? మండల స్థాయి సీనియర్ నేతకు దక్కుతుందా..? విధేయతకు ప్రాధాన్యత ఇస్తారా..? సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేస్తారా..?** అన్న ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడే వరకు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగనుంది.

మరిన్ని వార్తలు