జాతీయ పత్రికా దినోత్సవం

17-11-2026 | 12:13am

జడ్చర్ల, నవంబర్ 16: జాతీయ పత్రికా దినోత్సవాన్ని(National Press Day) పురస్కరించుకొని జడ్చర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని విలేకరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం మీడియా ప్రధాన బాధ్యత అని అన్నారు.

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఇలా ఏ రూపంలో ఉన్నా జర్నలిజం లక్ష్యం ప్రజల పక్షాన నిలబడటమే కావాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరుల కృషి అభినందనీయమని, ఎండనక, వాననక ప్రజల మధ్య ఉంటూ గ్రామీణ ప్రాంతాల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని కొనియాడారు. అలాంటి జర్నలిస్టులకు సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుత మీడియా రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వార్తల్లో సంచలనం కంటే వాస్తవానికి, వేగం కంటే విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిర్ధారణ లేని వార్తలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలని కోరారు.

జర్నలిస్టులు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలవాలని పేర్కొన్నారు. కలం ఎవరి ఒత్తిడికీ తలవంచకూడదని, గళం అన్యాయాన్ని ప్రశ్నించాలని అన్నారు.

"కలం అమ్ముడుపోకూడదు.. గళం మూగబోకూడదు.. నిజం వెనక్కి తగ్గకూడదు" అనే నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

అనంతరం జడ్చర్ల నియోజకవర్గ విలేకరులను లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ ఫరీద్, కార్యదర్శి కాల్వ రామిరెడ్డి, లయన్ పాపిరెడ్డి, లయన్ కైలాష్ ఝవర్, లయన్ శ్రీకాంత్, లయన్ రవిశంకర్, కూన యాదయ్యతో పాటు పలువురు విలేకరులు,మహేష్ విజయక్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు