హరీశ్ రావు అవినీతిపై నిగ్గు తేల్చాలి
- త్వరలోనే ‘భైరవ’ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడతాం
- రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలి.. కల్వకుంట్ల కవిత డిమాండ్
బోధన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(BRS leader Harish Rao) అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రావు అవినీతిపై ప్రజాక్షేత్రంలోనే కాకుండా చట్టపరంగా,
న్యాయపరంగా కూడా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సీబీసీఐడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు అందజేస్తామని తెలిపారు. తప్పు చేసిన వారెవరైనా చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
ప్రధానితో భేటీలో కరువు ప్రస్తావన ఏదీ?
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సీఎం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, పంట నష్టాల గురించి ప్రస్తావించి కేంద్రం నుంచి సాయం కోరకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
పెండింగ్లో ఉన్న బీసీ బిల్లు అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లకపోవడం అన్యాయమని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కాంట్రాక్టులు, కమీషన్ల గురించే చర్చించారని ఆరోపించారు.
రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని విమర్శించారు.
పంటలు వేయని రైతులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందిస్తుందో స్పష్టం చేయాలని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
‘భైరవ’ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర
ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత తెలిపారు. ‘పాంచజన్య సంకల్పం’లో భాగంగా త్వరలోనే ‘భైరవ’ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటామని, సామాజిక న్యాయం కోసం ప్రజలను చైతన్యపరుస్తామని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదని విమర్శించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం సరికాదు
ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని కవిత అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగానికి ఎదురయ్యే సమస్యలపై చర్చించేందుకు మంగళవారం తమ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యారంగ సమస్యలపై అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.