పట్నాన్ని తలపిస్తున్న మేడారం
11-01-2026
మేడారం, జనవరి 10 (విజయక్రాంతి): మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో మేడారం పట్టణాన్ని తలపిస్తోన్నది. రూ.101 కోట్లతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువయ్యే జాతర గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించారు. మేడారం నలువైపులా నాలుగు లైన్ల రహదారులుగా విస్తరించారు. జంపన్న వాగులో శాశ్వత ప్రాతిపదికన పనులు చేశారు. విద్యుత్, తాగునీరు, మెరుగైన రవాణా, వసతి సౌకర్యం ఏర్పాట్లు చేశారు. జంక్షన్‌లను గిరిజన సంప్రదాయం ఉట్టిపడే విధంగా కళాకృతులు ఏర్పాటుచేసి సుందరీకరిం చారు. దీంతో ములుగు నుంచి మేడారం వరకు తాడ్వాయి, జంగాలపల్లి జంక్షన్ల వద్ద ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరు గడించి, కోట్లాది భక్తులకు ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి సరికొత్త మురిపం సంతరించుకుని.. భక్తజనకోటికి ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు స్వాగతం పలుకనుంది. తరలివచ్చే అశేషజనవాహనిని ఆధ్యాత్మికతతో కనువిందు చేయనుంది.